కుటుంబ సభ్యులను కోల్పోయి అనాథగా మిగిలిన బాలిక
అనాథగా మిగిలిన బాలికకు చంద్రబాబు రూ.10 లక్షల సాయం
- By Admin --
- Saturday, 03 Aug, 2024
నంద్యాల జిల్లాలో ఓ మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాగలమర్రి మండలంలోని చిన్నవంగలి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలింది. ఇందులో నలుగురు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు అందరినీ కోల్పోయి అనాథగా మిగిలిన బాలికకు చంద్రబాబు నాయుడు రూ.10 లక్షల సాయం ప్రకటించారు. ఆ బాలిక సంరక్షణ బాధ్యతను కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. వంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు మిద్దె బాగా నానడంతో మిద్దె ఒక్కసారిగా కూలింది. నిద్రలోనే గురుశేఖర్ సహా అతడి భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి మృతి చెందారు.రెండో కూతురు గురు ప్రసన్న ప్రొద్దుటూరులో 10వ తరగతి చదువుకుంటోంది. ఇంట్లో అందరూ మృతి చెందడంతో పాప అనాథ అయ్యింది. ప్రస్తుతం గురు ప్రసన్న ఆమె నాయనమ్మ తల్లపురెడ్డి నాగమ్మ సంరక్షణలో ఉంది. నాగమ్మకు కూడా రూ.2 లక్ష సాయం అందించాలని అధికారులను చంద్రబాబు అదేశించారు. గురు ప్రసన్నకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.